News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Monday, April 13, 2026

దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అవసరం - ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్




బౌద్ధం, విద్య, సాంకేతికతతో సామజిక మార్పు సాధ్యం - వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి 

హైదరాబాద్, ఏప్రిల్ 13, 2026: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అనుసరించిన బౌద్ధం, విద్య, సాంకేతికత తోనే సామజిక మార్పు సాధ్యమని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. సామాజిక సాధికారత వారోత్సవాల్లో భాగంగా, "బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తనవైపు తిప్పుకోగలవా" అనే అంశంపై డా.బి.ఆర్. అంబేద్కర్ స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ బుద్ధుని సూత్రాలు, బౌద్ధమత బోధనలతో భారతదేశాన్ని ఐక్యం చేయవచ్చని అన్నారు. సామాజిక సమానత్వం, న్యాయానికి బౌద్ధమతమే మార్గమని అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తుచేశారు. సమాజాన్ని మార్చి, అణగారిన వర్గాలను అభివృద్దివైపు ప్రయాణించేలా చేసే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. విద్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడానికి, విస్తరించడానికి సాంకేతికతను అనుసంధానించడం ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు, అవగాహనను పెంచేందుకు అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న వెబ్ ఆధారిత టీవీ, రేడియో వేదికలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జ్ఞాన వ్యాప్తికి, సామాజిక మార్పును ప్రోత్సహించడానికి సాధనాలుగా ఈ వేదికలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ మాట్లాడుతూ కుల వివక్షను బి.ఆర్. అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారని, హిందూ మతంలో అర్థవంతమైన సంస్కరణలకు ఆస్కారం లేదని, అలాగే జాతీయతను కోల్పోయే భావనకు క్రైస్తవ మతం దారితీస్తుందని అంబేద్కర్ విశ్వసించారని పేర్కొన్నారు. "బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తనవైపు తిప్పుకోగలవా" అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం చాలా అవసరమని, అది లేకుండా సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని వివరించారు. రాజకీయ, సామాజిక దృక్పథాలతో ఇస్లాం ఏకీభవించలేదని, సంస్కరణలకు పరిమిత అవకాశాలను మాత్రమే కల్పించిందని అంబేద్కర్ విశ్వసించారని తెలిపారు. అంబేద్కర్ నవ-బౌద్ధాన్ని స్వీకరించడం... సమానత్వం, హేతుబద్ధత, సామాజిక న్యాయంపై ఆధారపడిన ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించిందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలను నేటి పాలకులు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆయన ఆలోచనా `సారాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఊహించిన సామాజిక సమానత్వం, ఆధ్యాత్మిక విలువలు రెండింటిపై ఆధారపడి సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యను, శ్రమ గౌరవాన్ని నేటి పాలకులు విస్మరిస్తున్నారని గుర్తు చేశారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఆహార పరిజ్ఞానం, ఉత్పత్తి వ్యవస్థలకు ఆదివాసులు చేసిన కృషిని గుర్తించాలని సూచించారు. అలాంటి ఆదివాసీలు విద్యకు దూరంగా ఉన్నారని, అలాంటి వారికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉచిత విద్య అందించడం అందంగా ఉందని పేర్కొంటూ అలాంటి వినూత్న ఆలోచన చేసిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిని కొనియాడారు. బాధ్యతాయుతమైన వ్యక్తులను తీర్చిదిద్దడంలో విద్య, గ్రంథాలయాలు, కుటుంబ విలువల ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, సమానత్వంతో కూడిన సామాజిక వ్యవస్థను నిర్ధారించడానికి జాతీయ రాజధాని వరకు అన్ని స్థాయిలలో రాజ్యాంగాన్ని తప్పనిసరిగా రక్షించాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డైరెక్టర్ (అకాడమిక్) ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి మాట్లాడుతూ బి. ఆర్. అంబేద్కర్ సిద్ధాంతం సమానత్వ సూత్రంలో పాతుకుపోయిందని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు నిష్పక్షపాతాన్ని, న్యాయాన్ని అందించడమే అంబేద్కర్ దార్శనికత అని ఆ దిశగా యూనివర్సిటీ పయనిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన ఫెలోషిప్‌లను ప్రవేశపెట్టడం, నైపుణ్య ఆధారిత విద్యను బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. అభ్యాసకుల సామర్థ్యాలను పెంచడం, సమ్మిళిత, వృత్తి ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. ఫైనాన్స్ అధికారి శ్రీ ఎన్. సి. వేణుగోపాల్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. సుధా రాణి, ప్రొ.వడ్డానం శ్రీనివాస్, ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, బోధనేతర ఉద్యోగుల సంఘం సభ్యులు కాంతం ప్రేమ కుమార్, విశ్వనాథ్, మియాజనీ, భరత్ రెడ్డి, డా. యాకేష్ దైదా అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోదక విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

WORLD ENVIRONMENT DAY ORGANISED AT BRAOU

Hyderabad, June 5, 2026: Dr.B.R.Ambedkar Open University, organized World Environment Day at its campu...