News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Wednesday, April 8, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” అంశంపై సింపోజియం

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
 
 • వర్శీటీలో కొనసాగుతున్న సామాజిక సాధికారత ఉత్సవాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 8, 2026 : సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” అనే అంశంపై బుధవారం సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కోన్నారు. రిజర్వేషన్ కల్పించడం అంటే ప్రాథమికంగా అన్ని వర్గాల వారికి అవకాశాలను సమానంగా అందేలా చూడడమే అని అభిప్రాయపడ్డారు. అందరికీ న్యాయం జరిగేలా చూడటానికి, ఈ పంపిణీ అనేది జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉండాలని ఉద్ఘాటించారు. రిజర్వేషన్ కేవలం ఒక నిబంధన మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని వెల్లడించారు. విద్యాసంస్థల పాత్రను ప్రస్తావిస్తూ అవి మౌనంగా ఉంటే, రాజకీయ శక్తులు ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టించొచ్చని హెచ్చరించారు. చారిత్రక మూలాలను వివరిస్తూ, సమానత్వ భావనను మొట్టమొదట మహాత్మా జ్యోతిరావు ఫూలే బలంగా ప్రతిపాదించారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కేవలం ఆర్థిక ఉన్నతికి మాత్రమే పరిమితం కాదని, అందులో అన్ని వర్గాల ప్రజల గౌరవ మర్యాదలు కూడా ఇమిడి ఉంటాయని చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తికి సమాన విలువను కల్పించాలని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్యానలిస్టులు, ప్రముఖ విద్యావేత్తలు “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” అనే అంశంపై చర్చించారు. శాతవాహన విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొ.ఎస్. మల్లేష్ మాట్లాడుతూ చట్టం ముందు మానవులందరూ సమానులేనని, వారందరికీ ఒకే రకమైన ప్రాథమిక హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కులపరమైన అధికార శ్రేణులు, మనుస్మృతి వంటి గ్రంథాలు... సామాజిక న్యాయాన్ని సాధించడంలో ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నారు. భారత సమాజంలో సాంస్కృతిక నియంత్రణకు స్థానం లేదన్నారు. నిజమైన ప్రజాస్వామ్యానికి సమానత్వ తత్వమే పునాది అని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సామాజిక శాస్త్రాల విభాగ మాజీ డీన్, ప్రొ. చన్న బసవయ్య మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్స్ మినహా, ఇతర రకాల రిజర్వేషన్లు అన్నీ భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్ఫూర్తిని, విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. సమాన ప్రాతినిధ్యమే దీని మూల సారం అని వెల్లడించారు. కుల ఆధారిత అసమానతలు పూర్తిగా నిర్మూలించబడే వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని పునరుద్గాటించారు. ప్రతి ప్రభుత్వ సంస్థలో విభిన్న స్వరాలకు ప్రాతినిధ్యం లభించేలా అన్ని రంగాలలో రిజర్వేషన్లను విస్తరించాలని పిలుపునిచ్చారు. అప్పుడే సమాన అవకాశాలు అన్ని వర్గాలకు కల్పించినట్లు అవుతుందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు శ్రీ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికీ కుల వ్యవస్థలచే తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొంటూ, వెనుకబడిన తరగతులు తమ పూర్తి హక్కులు, అర్హతలను తప్పక పొందాలని, దానికోసం అవసరం అయితే పోరాటానికి సిద్ధ పదాలని పిలుపునిచ్చారు. ఇటీవల బీసీలపైన దాడులు పెరిగాయని, మహబూబ్ నగర్ జిల్లా ఘటనను ఉదహరిస్తూ బీసీ అట్రాసిటీ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడటానికి బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా అమల్లోకి తేవాలని పేర్కొన్నారు. వర్ణ వ్యవస్థను నిర్మూలించాలని కోరుతూ, రిజర్వేషన్ విధానాలను సమష్టిగా కాపాడుకోవడానికి బహుజన వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రాల విభాగ డీన్, ప్రొ.పల్లవి కబ్డే అధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వాహకులు, బీసీ సెల్ కో కోఆర్డినేటర్ డా.ఎ. రామదేవి కార్యక్రమ ఆవశ్యకతను వివరించి, ప్యానలిస్టులు, ప్రముఖ విద్యావేత్తలను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. పి. వెంకట రమణ ప్రొ.బి. శ్రీనివాస్, ప్రొ.ఎన్. రజని, ప్రొ.కె. రాణి రజిత మాధురి, ప్రొ.కె. కృష్ణారెడ్డి, ప్రొ. ప్రమీలా కేతావత్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు కె. ప్రేం కుమార్, విశ్వనాథ్, మియా జానీ, డా. యాకేష్ దైదా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...