News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Sunday, April 5, 2026

డా. బీ.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో...10 రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు


 

వర్శీటీలో ఘనంగా జగ్జీవన్ రామ్ కి నివాళులు

హైదరాబాద్, ఏప్రిల్ 5, 2026:  డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ లో ఆదివారం మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్   ప్రొ.ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా . ఎల్వీకే రెడ్డి, పలువురు డైరెక్టర్లు, డీన్లు,  ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అనంతరం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా . ఎల్వీకే రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన ప్రజల అభ్యున్నతికి, విద్యా వికాసానికి, దేశ సమైక్యతకు, సమగ్రతకు దిశా నిర్దేశం చేసిన మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని సామాజిక సాధికార వారోత్సవాలు నిర్వహించాలని డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీ నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమాలు  మాజీ ఉప ప్రధాని, బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలతో మొదలై భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత డా. బి.ఆర్‌. అంబేద్కర్‌  జయంతి ఉత్సవ కార్యక్రమాలతో ముగుస్తాయన్నారు. అనేక అసమానతలకు నిలయంగా ఉన్న భారత దేశంలో సమాన అవకాశాల కోసం అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేసిన మహనీయుల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబు జగ్జీవన్ రామ్, డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ అగ్రగణ్యులు. సామాజిక న్యాయాన్ని, సాధికారతను జ్యోతిబా ఫూలే ఒక ఉద్యమంగా మొదలుపెడితే అంబేద్కర్‌ దాన్ని రాజ్యాంగబద్ధం చేసి ఈ దేశ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు నాయకులు విద్యను ప్రధాన సాధనంగా చేసుకుని అణగారినవర్గాలకు ఆత్మస్థైర్యాన్ని, సమాజంలో గౌరవాన్ని, విలువను సాధికారతను కల్పించే దిశగా కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్‌ మహాశయుడు చదువు ఒక్కటే సాధికారతకు మూలమని, దీంతో అన్ని అసమానతలను రూపు మాపే అవకాశం ఉందన్నారు. మనకు లభించే సమస్త అవకాశాలలో వేటి నైనా వదులుకోవచ్చు కానీ చదువును మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవడానికి వీల్లేదని అంబేద్కర్ స్పష్టంగా నమ్మారని, ఆయన తన జీవితంలో దాన్ని ఆచరించి ప్రపంచం  గర్వించదగ్గ విద్యావేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి దిక్సూచిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ లైసన్ ఆఫీసర్ డా. బనోత్ ధర్మ, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, పలు విభాగాల అధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ కుమార్, విశ్వనాథ్, భరత్ రెడ్డి, ఎన్.సి. వేణు గోపాల్ తదితరులు హాజరయ్యారు.

అంబేద్కర్ వర్శీటీలో సామాజిక సాధికార ఉత్సవాల వివరాలు :

సామాజిక సాధికార ఉత్సవాల్లో భాగంగా మహనీయుల జయంతుల నిర్వాహణ, ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు, సదస్సులు, సాహిత్య సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహానీయుల జీవిత చరిత్రలపై క్విజ్ నిర్వాహణ, కళాకారులతో కళాఖండాల రూప కల్పన తదితరాలు ఉంటాయి. ఇందులో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి... 

ఏప్రిల్‌ 5  : బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు.

ఏప్రిల్‌ 6 :  ఆధునిక భారతదేశ అభివృద్ధిలో జగ్జీవన్ రామ్ పాత్ర పై ఉపన్యాసం.

ఏప్రిల్‌ 7 : “సామాజిక న్యాయం కోసం కళలు  - ఆర్టిస్ట్ ల ఆద్వర్యంలో శిబిరం”.

ఏప్రిల్ 8 : “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” పై సదస్సు;

ఏప్రిల్ 9:  ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ (వ్యవస్థాపకుల వేదిక).

ఏప్రిల్ 10 : “ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం: సంఘర్షణలు, వైరుధ్యాలు, భవిష్యత్ కార్యాచరణ” పై జాతీయ సదస్సు నిర్వహిస్తారు. ఇందులో  ముఖ్య అతిథిగా  సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పాల్గొంటారు.

ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిబా పూలే స్మారక ఉపన్యాసం, ఈ కార్యక్రమంలో డా. సంగిశెట్టి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగిస్తారు. ‘ఫులే' తెలుగు చలనచిత్రం ప్రత్యేక ప్రదర్శన; మధ్యాహ్నం : ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో “అంబేద్కర్-1” పుస్తకంపై చర్చ ఉంటుంది.  

ఏప్రిల్ 13: డా.బి.ఆర్. అంబేద్కర్ స్మారక ఉపన్యాసం, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా ప్రొ. కంచే ఐలయ్య హాజరుకానున్నారు. 

ఏప్రిల్ 14 : డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌  చిత్రపటానికి పుష్పాంజలి, ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ డిజిటల్ సాధికారత కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా, కళాశాల విద్య కమీషనర్ శ్రీ దేవసేన, పూర్వ విద్యార్ధి, జ్యోతి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొంటారు. అదేవిధంగా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమతా ఫెల్లోషిప్స్ స్కీం కింద అర్హత పొందిన ఆదివాసీ విద్యార్ధులకు, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫెలోషిప్స్ అందించనున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...