News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Thursday, March 26, 2026

అంబేద్కర్ వర్శీటీలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై ముగిసిన జాతీయ సదస్సు

ఓపెన్ యూనివర్సిటీలపై పెరిగిన యూజీసీ నియంత్రణ
 • పలు కార్పొరేట్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి – ఇది మంచి పరిణామం కాదు - : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 

 హైదరాబాద్, మార్చి 26, 2026: ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, గుజరాత్‌కు చెందిన ఇన్ఫ్లిబ్నెట్ భాగస్వామ్యంతో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.నవీన్ చంద్ర లోహాని పాల్గొని ప్రసంగించారు. ప్రొ.లోహాని మాట్లాడుతూ చైనాలో సాంప్రదాయ విశ్వవిద్యాలయాల కంటే ఓపెన్ యూనివర్సిటీలు చాలా మెరుగ్గా ఉన్నాయని ప్రొ. లోహాని అభిప్రాయపడ్డారు. నిధుల కొరత కారణంగా దేశంలో సార్వత్రిక విద్యా సంస్థలను నడపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. మారుతున్న ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన భాద్యత దూర విద్యా సంస్థలపై ఉందని పేర్కొన్నారు. అభ్యాసకుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ యూనివర్సిటీలు సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ను కూడా సొంత నిధులతోనే రూపొందిస్తున్నాయని, దూర విద్యను అందించే విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు పెంచాలని ప్రభుత్వాలను కోరారు. రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ యూజీసీ దూరవిద్య విశ్వవిద్యాలయాలను కట్టడి చేయడానికి అనేక సరికొత్త నిబంధనలు పెడుతుందని తద్వారా ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా అతి తక్కువ సమయంలో మారుతున్నాయని, ఈ విషయం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు కూడా తెలియట్లేదన్నారు. అలా మారడం వల్ల ఉచిత విద్య కాస్త ఓ కార్పొరేట్ విద్యగా, అదో వ్యాపార వస్తువుగా మారిందని, ఇది పేద విద్యార్ధులకు దూరం అవడమే కాకుండా ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే వారికి భారంగా మారుతోందని ప్రొ. ఘంటా చక్రపాణి ఆందోళన వ్యక్త పర్చారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) అధ్యక్షులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసి ప్రొ. కె. సీతారామ రావు మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యాప్తికి, అభివృద్ధికి ఐడియా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. యూజీసీ లేదా మరో నియంత్రణ సంస్థ దేశంలోని ఓపెన్ యూనివర్సిటీ లను కట్టడి చేస్తుంటే భరించేది లేదని, పేద ప్రజలకు అందుబాటులో ఉండేది దూర విద్య మాత్రమేనని ఈ విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలని సూచించారు. యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, (నాసిక్ - మహారాష్ట్ర) మాజీ ఉపకులపతి ప్రొ.ఇ.వాయునందన్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ & డైరెక్టర్ (అకడమిక్) ప్రొ. జి. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ రెండు రోజుల జాతీయ సదస్సులో దూర విద్యా వ్యాప్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పేరు గాంచిన పలు ఓపెన్ యూనివర్సిటీల వీసీలు, మాజీ వీసీలు, ఆయా విభాగాల డైరెక్టర్ లు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సు సమగ్ర రిపోర్టును సభకు సమర్పించారు. ఐడియా సెక్రటరీ జనరల్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కె. రెడ్డి కూడా సభలో మాట్లాడారు. ఐడియా బలోపేతానికి రానున్న రోజుల్లో మరిన్న చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రాం రెడ్డి స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిజిటల్ లెర్నింగ్ ప్రత్యేక అధికారి ప్రొ. సంజయ్ మిశ్రా పాల్గొని “ ఓపెన్ డిస్టెన్స్ పాలసీ అండ్ లీడర్షిప్” అనే అంశంపై ప్రసంగించారు. ఈ ప్లీనరీ సెషన్ కి జీ.ఆర్.సి.ఆర్.డి. డైరెక్టర్ ప్రొ. ఇ. సుధారాణి అధ్యక్షత వహించారు. ఆ తర్వాత “జాతీయ విద్యా విధానం, డ్యూయల్ మోడ్ విశ్వవిద్యాలయాలు: సమస్యలు, సవాళ్లు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, దూర విద్యా విభాగం డైరెక్టర్ ప్రొ.ఎస్. జిలానీ అధ్యక్షత వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి ప్రముఖ ప్యానలిస్టులు ముంబై విశ్వవిద్యాలయం, CDE మాజీ డైరెక్టర్ ప్రొ.డి. హరిచందన్; మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, దూర విద్యా విభాగ డైరెక్టర్ ప్రొ. రజావుల్లా ఖాన్; ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగ మాజీ డైరెక్టర్ ప్రొ. జె. రాము నాయుడు; కాకతీయ విశ్వవిద్యాలయం, దూర విద్యా విభాగం మాజీ డైరెక్టర్ ప్రొ.కె. మురళీ మనోహర్; డా.కిషోర్ మెండెం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పలు సాంకేతిక సెషన్స్ నిర్వహించగా ఇందులో దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి హాజరైన అధ్యాపకులు, పరిశోధకులు తమతమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.

No comments:

Post a Comment

BRAOU VC RELEASED TWO DAY NATIONAL SEMINAR BROCHURE

Hyderabad, March 31, 2026: Prof. Ganta Chakrapani, Vice-Chancellor of Dr. B.R. Ambedkar Open University was released the brochure of two-da...