News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Monday, March 30, 2026

అంబేద్కర్ యూనివర్సిటీ ఆదివాసి, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్స్


 

• సమతా స్కీం కింద ఆర్ధికంగా అండ 

హైదరాబాద్, మార్చి 30, 2026: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో చేరిన ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వనున్నట్లు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఆ ఫౌండేషన్ చైర్మన్, ఓ సాఫ్ట్వేర్ సంస్థ  (అమెరికా) అధినేత దూదిపాల జ్యోతి రెడ్డి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణిని కలిసి ప్రతిపాదనలు అందించారు.

వరంగల్ జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి అంచెలంచలుగా ఎదిగి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న జ్యోతి రెడ్డి తనకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చిన విద్యా సంస్థకు ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉన్నత విద్యాభ్యాసానికి దూరంగా ఉన్న ఆదివాసీ తెగలకు, ట్రాన్స్ జెండర్ లకు ఆర్ధికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. జ్యోతి రెడ్డి ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి ఈ విషయంపై త్వరలోనే అధికారులతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తమ విశ్వవిద్యాలయంలో అభ్యసించి ఎదగడమే కాకుండా ఆదివాసీల, ట్రాన్స్ జెండర్ ల అకాడమిక్ కెరీర్ అభివృద్ధికి పాటు పడతానని ఓ పూర్వ విద్యార్ధి ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని, ఇది పలువురికి ఆదర్శవంతంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమ్మి రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్  ప్రొ. పుష్పా చక్రపాణి, వీసీ ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...